జీవన రేఖలు

అల్లంరాజు వెంకటరావు అసలు పేరుతో కంటే సుధామ గా పేరు పొందిన కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.ప్రముఖ వక్త ,సాహితీవేత్త ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి
సుధామ [1]1951, నవంబర్ 25వ తేదీన విశాఖ జిల్లా అనకాపల్లిలో అల్లంరాజు కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించారు . పితామహులు మిలటరీ లో పనిచేయగా మాతామహులు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు .ఒకటో తరగతి నుండి మొత్తం విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల నుండి ఎం.ఓ.యల్ ప్రాచ్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివి ‘ తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావచిత్రాలు ‘ అనే అంశం పై ఎం.ఫిల్ పరిశోధన చేసారు.
ఆ తరువాత 1975-1977 లలో కరీంనగర్ లోని బిషప్ సాల్మన్ జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు..
1978లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగంలో ట్రాన్స్‌మిషన్ ఎక్జిక్యూటివ్‌గా చేరి, 1982 లో ప్రధానకేంద్రానికి బదిలీ అయ్యి 1991 లో ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ (కార్యక్రమ నిర్వహణాధికారి))గా పదోన్నతి పై విజయవాడ ఆకాశవాణి తెలుగు విభాగాన్ని ఉషశ్రీ గారి అనంతరం నాలుగేళ్ళు నిర్వహించి,
1995 నుండి హైదరాబాద్ లో తెలుగువిభాగం అధిపతి గా, ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ కో -ఆర్డినేటర్ గా చేసి,రెండేళ్ళు వరంగల్ కేంద్రంలోనూ పనిచేసి ,చివరగా 2008 ఆగస్టు లో వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగం కార్యక్రమ నిర్వహణాధికారిగా స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు .
చిత్రకళ, సంగీత, సాహిత్యాలలో సుధామకు ప్రవేశం ఉంది.పాఠశాలలో వుండగానే పదేళ్ళవయసులో ‘విజ్ఞానజ్యోతి ‘అనే లిఖితపత్రికనుసంపాదకునిగా నిర్వహించారు.అమర్ జవహర్ బాలానంద సంఘం స్థాపించి బాలల వికాసానికికృషి చేశారు.
యవ్వనదశలో 1967 లో యువమిత్ర సచిత్ర లిఖితమాసపత్రిక ను సంపాదకులుగా దాదాపు ఎనిమిది సంవత్సరాలు నిర్వహించారు.
సుధామ దాదాపు అన్నీ తెలుగు పత్రికల ద్వారా తెలుగు సాహిత్యప్రపంచం లో కవిగా,కార్టూనిస్ట్ గా,చిత్రకారునిగా ,కాలమిస్ట్ గా, పుస్తక,సినిమా సమీక్షకునిగా,సాహిత్య విమర్శకునిగా,పజిల్స్ నిర్మాతగా ,సాహితీవేత్తగా పేరొందారు. సుమారు నూరు గ్రంథాలకు ముఖచిత్రాలు సంతరించారు ప్రముఖ వక్తగా ప్రసిద్ధులు.
ప్రతిష్టాత్మక సాహిత్య సంస్థ యువభారతి లో క్రియాశీల కార్యకర్తగా అనేక సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం యువభారతి ప్రచురణల ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
2021 మార్చి లో “ఓ సారి చూడండి..అంతే’ పేరిట వినూత్న వాట్సప్ గ్రూప్ నేర్పరచి ప్రతి ,గురువారం వాట్సప్ ప్రసార సంచికగా విజ్ఞాన ,వినోద ,వికాసాలను ఆరునెలలపాటు పంచారు వాట్సప్ ,టెలిగ్రామ్ ,సిగ్నల్ మాధ్యమాలలో వెయ్యిమందికి పైగా సభ్యులతో అలరారుతున్న ఈ విశిష్ట సాంకేతిక సమూహ స్థాపకులుగా గుర్తింపుపొందారు.